
దసరా వేళ సైబర్ మోసాలు
భువనగిరిటౌన్ : దసరా వేళ ఈ కామర్స్ కంపెనీలు ఆఫర్లు ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి ప్రజలను మోసం చేస్తుంటారు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింకులపై క్లిక్ చేయొద్దు. లాటరీ తగిలిందని, గిఫ్ట్ వచ్చిందని, డ్రాలో కారు, బైక్ వెళ్లిందని, డబ్బులు గెలుచుకున్నారని నమ్మిస్తారు. అలాంటి మాటలను నమ్మొద్దని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందించాలి. లేదంటే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
దసరా పండుగకు సొంతూరు వెళ్లాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యే ప్రమాదముంది. ఎందుకంటే తాళాలు వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్. అందుకే ఊళ్ల ప్రయాణాలతో పాటు విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి సైతం రాచకొండ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
పోలీసు శాఖ సూచనలు ఇవీ..
● డబ్బు, ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదు.
● పక్కింటి వారిని నమ్మి వారికి విలువైన వస్తువులను ఇచ్చి మోసపోవద్దు.
● ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలి.
● అనుమానితుల సంచారం, కొత్త వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
● తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
● ఇరుగుపొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టాల ని చెప్పి వెళ్లడం మంచిది. వారి ద్వారా ఇంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
● ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దు.
● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
● చుట్టు పక్కల వారి సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.
● వెళ్లేటప్పుడు ఇంటి తాళాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
● ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
● సొంతూరు, పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు వెళ్లిన వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి చేరుకోవాలి.
ఫ ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి
ఫ రాచకొండ పోలీసుల సూచనలు