
ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి
భువనగిరిటౌన్: 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మూడేళ్ల నుంచి వృద్ధాశ్రమాలు, అనాథ, మానసిక, వికలాంగుల తదితర ఆశ్రమాలు నిర్వహిస్తున్న గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిలా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్యాంసుందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను భువన గిరిలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అ ధికారి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణంలో ఏమైనా
సమస్యలున్నాయా..
ఆలేరురూరల్ : మండలంలోని మందనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. లబ్ధిదారు గౌరమ్మ ఇంటికి వెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇటుక, సిమెంట్ ఎంతకు కొనుగోలు చేస్తున్నావని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఎవరికైనా ఆ ర్థికంగా ఇబ్బందులు ఉంటే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం తీసుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, డీటీ ప్రదీప్ ఉన్నారు.
పేద విద్యార్థులకు చేయూతనిస్తాం
యాదగిరిగుట్ట రూరల్: రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘ భవనం తరఫున చేయూతనిస్తామని డైరెక్టర్లు హరినాథ్‌రెడ్డి, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పేద విద్యార్థులకు తమ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి ఉన్నత చదువుల కోసం ఇప్పటికే ఎంతో మందికి ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. త్వరలో తిరుమల తిరుపతిలో కూడా అధునాత హంగులతో రెడ్డి సంక్షేమ సంఘ భవన్ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘ భవన డైరెక్టర్ విజయేందర్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సత్తిరెడ్డి ఉన్నారు.
ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ నేత్రపర్వంగా చేపట్టారు. ప్రధానాలయం, విష్ణు పుష్కరిణితో పాటు పాతగుట్ట క్షేత్రంలో ఆంజనేయస్వామి విగ్రహాలను సింధూరం, పూలతో అలంకరించి మన్య సూక్త పారాయణములు పఠిస్తూ పాలతో అభిషేకం, నాగవళ్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనలు గావించారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు.

ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి