
కుమార్తెను చంపిన తండ్రి అరెస్ట్
సూర్యాపేటటౌన్: భార్యతో గొడవపడి పదకొండు నెలల కుమార్తెను నేలకేసి కొట్టి చంపిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకటయ్య విలేకరులకు వెల్లడించారు. నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వెంకటేశ్వర్లుకు గుండాల మండలానికి చెందిన కవితతో వివాహం జరిగింది. ఏడాది తర్వాత వారి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో విడిపోయారు. ఆ తర్వాత 2023లో ఏపీలోని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన నాగమణిని వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకున్నాడు. వీరు సూర్యాపేట పట్టణంలోని ప్రియాంక కాలనీలో అద్దెకు ఉంటున్నారు. బీటెక్ చదివిన వెంకటేశ్వర్లు స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూనే ఇంటి వద్ద ట్యూషన్ చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కుమార్తె పుట్టిందనే కోపంతో..
వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులకు 2024 అక్టోబర్ 10న కుమార్తె భవిజ్ఞ(11 నెలలు) జన్మించింది. తనకు కుమార్తె పుట్టిందనే కోపంతో వెంకటేశ్వర్లు ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో రెండు నెలల క్రితం నాగమణి కుమార్తెను తీసుకొని తన పుట్టింటికి వెళ్లింది. వెంకటేశ్వర్లు ఆమెకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి తీసుకొచ్చాడు. ఈ నెల 19న రాత్రి 11గంటల సమయంలో పూటుగా మద్యం తాగిన వెంకటేశ్వర్లు భార్యతో గొడవపడి ఆమెను కొడుతుండగా.. చిన్నారి భవిజ్ఞ నిద్రలేచి ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వచ్చింది. అప్పటికే కోపంలో రగిలిపోతున్న వెంకటేశ్వర్లు తన కుమార్తె రెండు కాళ్లు పట్టుకొని నేలకేసి బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం వెంకటేశ్వర్లు బైక్‌పై పరారయ్యాడు. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లుని సోమవారం సూర్యాపేటలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.
రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన
సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య