
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడి మృతి
చిట్యాల: హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలో జరిగింది. సోమవారం చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన విపుల్‌కుమార్(18) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో నివాసముంటూ గ్రామ శివారులోని శ్రీపతి ల్యాబ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిస్తున్నాడు. రోజు మాదిరిగా ఆదివారం డ్యూటీకి వెళ్లిన విపుల్‌కుమార్ రాత్రి 8గంటల సమయంలో విధులు ముగించుకుని గుండ్రాంపల్లి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో పరిశ్రమ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల యూటర్న్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదలంఓ విపుల్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
సాగర్ ఎడమ కాలువలో
యువకుడి గల్లంతు
వేములపల్లి: వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ శివారులో నాగార్జునసాగర్ ఎడమ కాలువలో సోమవారం సాయంత్రం ఓ యువకుడు గల్లంతయ్యా డు. ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపాలెం గ్రామానికి చెందిన బొల్లెద్దు సతీష్ మరో నలుగురు యువకులతో కలిసి సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రుత్విక్ అనే బాలుడు ఈత సరిగా రాక నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. సతీష్ గమనించి వెంటనే రుత్విక్‌ను కాలువ ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో ఆయాసం ఎక్కువై నీటి ప్రవాహంలో ఒక్కసారిగా సతీష్ గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎడమ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సతీష్ ఆచూకీ లభ్యం కాలేదు. సతీష్ తమ్ముడు బొల్లెద్దు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.