
వైటీడీ పబ్లికేషన్ కార్యాలయం ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరి కొండ పైన వైటీడీ పబ్లికేషన్ కార్యాలయాన్ని ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. వైటీడీ కార్యాలయం ప్రారంభంతో పత్రిక ప్రచురణ, సబ్‌స్క్రిప్షన్ నమోదు, పంపిణీ క్రమబద్ధంగా నిర్వహించబడతాయన్నారు. భక్తులు నేరుగా కార్యాలయానికి వచ్చి యాదగిరి మాస పత్రికను కొనుగోలు చేసి, సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చని వెల్లడించారు. యాదగిరి మాసపత్రిక ద్వారా ఆలయం, భక్తుల మధ్య మరింత అనుబంధం ఏర్పడి, ఆలయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయన్నారు.
హుండీ ఆదాయం రూ.2 కోట్లు
యాదగిరిగుట్ట ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను సోమవారం కొండ దిగువన శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లెక్కించారు. హుండీల్లో నగదు రూ.2,00,83,825, మిశ్రమ బంగారం 65 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 800గ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ సైతం హుండీల్లో లభించాయని తెలిపారు. ఈ హుండీ ఆదాయం 34 రోజులదని ఈఓ పేర్కొన్నారు.