
రూ.232 కోట్లతో పోలీసు గృహాల నిర్మాణం
నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా రూ.232 కోట్లతో పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మించిన ఏఆర్ డీఎస్పీ రెసిడెన్షియల్ క్వార్టర్, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లను, శిశువిహార్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడైనా క్వార్టర్లు శిథిలావస్థలో ఉంటే వాటిని తొలగించి కొత్తగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయం 50ఏళ్ల క్రితం నిర్మించిందని, త్వరలో దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏఆర్ కానిస్టేబుళ్ల క్వార్టర్లు కూడా నూతనంగా నిర్మిస్తామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24గంటలు పనిచేస్తారని వారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమాజంలో మత్తు పదర్ధాల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఐజీ తఫ్సీర్ ఇక్బాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి