
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
డైరెక్టర్ రవీంద్రనాయక్
యాదగిరిగుట్ట: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. అందిస్తున్న వైద్యుల సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో సమావేశమై జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వైద్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, మెడికల్ ఆఫీసర్ పావని, డాక్టర్ హరీష్, సీహెచ్‌వో వెంకటయ్య, పీహెచ్‌ఎన్ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో ఏర్పాటు చేసిన స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను ఈఓ వెంకట్రావ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ఆలయ ప్రసాద విభాగం వద్ద మూడు, చౌల్ట్రీస్, డోనార్ సెల్, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాల వద్ద ఒక్కో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిటల్ పేమెంట్ ద్వారా కియోస్క్ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శనం, సేవల టిక్కెట్లు, ప్రసాదం, వ్రతాలకు సంబంధించిన టిక్కెట్లను పొందవచ్చన్నారు. భక్తులు వేగంగా, సులభంగా కౌంటర్ల వద్ద ఆలస్యం లేకుండా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, కెనరా బ్యాంక్ అధికారులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యసేవలు అందించాలి