
కలగానే వంతెన నిర్మాణం
వంతెన నిర్మాణం చేపడుతాం
ఆలేరురూరల్: కొలనుపాక వాగుపై దశాబ్దాల నాటి కాజ్‌వే శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 100 మీటర్లు ఉన్న కాజ్‌వే పూర్తిగా దెబ్బతింది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు కాజ్‌వే మీదుగా నీరు ప్రవహించి కొన్ని రోజుల వరకు రాకపోకలు స్తంభిస్తాయి. వాహనాలతో కాజ్‌వేపై జారిపడి ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
రూ.4.50 కోట్లు మంజూరు
రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో ఏడాది క్రితం జీహెచ్‌కే సంస్థతో టెండర్ అగ్రిమెంట్ జరిగింది. ఏడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఉపరితలం మీదుగా నీటి ప్రవాహం ఉన్నా తట్టుకునేలా 3.5 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాలి. బ్రిడ్జి నిర్మాణాన్ని 15 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
పలు జిల్లాలకు ప్రధాన మార్గం
కొలనుపాక రాఘవాపురం బైరాంనగర్, గ్రామాల్లో సుమారు 2500 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వీరంతా తమ అవసరాల నిమిత్తం ఆలేరు పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. అంతేకాకుండా రాజాపేట, జనగాం జిల్లా బచ్చెనపేట, పోచన్నపేట, చేర్యాల, సిద్దిపేటకు ఇది ప్రధాన మార్గం. నిత్యం వందలాదిగా వాహనాలు కాజ్‌వేపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి.
జరిగిన ప్రమాద ఘటనలు ఇలా..
● కొలనుపాకకు చెందిన ధర్మ శ్రీనివాస్‌రెడ్డి తన బైక్‌పై సాయంత్రం సమయంలో ఆలేరు నుంచి కొలనుపాకకు వెళ్తుండగా నీటి ప్రవాహానికి జారిపడి తీవ్రగాయాలపాలయ్యాడు.
● బచ్చనపేటకు చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా నీటి ఉధృతికి వంతెన నుంచి దిగువకు పడిపోయారు. అదేవిధంగా ప్రయాణికులతో వెళ్తున్న కొలనుపాకకు చెందిన ఆటో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆటో ఉన్న ప్రయాణికులకు గాయపడ్డారు.
● ఉపాధ్యాయురాలు స్కూటీపై ఆలేరుకు వస్తూ వాగుదాటే క్రమంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
కొలనుపాక వాగుపై
శిథిలావస్థకు చేరిన కాజ్‌వే
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై
రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు
ఏటా వర్షాకాలంలో తప్పని అవస్థలు
కొలనుపాక వాగుపై వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగింది. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది వాస్తవమే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక మరమ్తతులు చేపడుతాం. – బాలప్రసాద్, ఈఈ
ఆర్‌అండ్‌బీ, భువనగిరి డివిజన్