
నేడు తాగునీటి సరఫరా నిలిపివేత
భువనగిరిటౌన్ : గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్–1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వ్‌లు అమర్చనుండడంతో బుధవారం మంచి నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు మిషన్ భగీరథ భువనగిరి డివిజన్ కార్యనిర్వహణ ఇంజనీర్ కరుణాకరణ్ మంగళవారం తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట (8 గ్రామాలు), పోచంపల్లి (16 గ్రామాలు, మున్సిపాలిటీ కింద కొత్తగా చేరిన 9గ్రామాలు) మండలాలు, ఆలేరు నియోజకవర్గం లోని రాజాపేట, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం మండలాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
క్షేత్రపాలకుడికి
నాగవల్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో స్వామివారికి సింధూరంతోపాటు పాలతో అభిషేకం జరిపించారు. ఆంజనేయస్వామిని పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక.. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి.
విద్యార్థుల తల్లిదండ్రులతో
సమావేశం నిర్వహించాలి
భువనగిరిటౌన్ : వసతి గృహాల్లో ఈ నెల 13న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జినుకల శ్యాంసుందర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల ప్రగతిపై సమీక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా అమలైన 100 రోజుల కార్యాచరణ
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలైందని సీడీఓ హేమలత తెలిపారు. 100 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం భువనగిరి మున్సిపాలిటీని ఆమె సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆధ్వర్యంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం చేసిన కార్యక్రమాల గురించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ రిసోర్స్ పార్క్ డంపింగ్ యార్డ్‌ను వర్మీ కంపోస్టింగ్ ప్రాసెస్, పొడి చెత్తను రీసైక్లింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏబీసీ సెంటర్ (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్)ను సందర్శించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎస్‌సీ సెంటర్‌ను పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

నేడు తాగునీటి సరఫరా నిలిపివేత