
దక్షిణంలోనూ ఆందోళన
‘రీజినల్’ అలైన్‌మెంట్ మార్చాలని భూ నిర్వాసితుల డిమాండ్
సాక్షి,యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తర భాగంలోని రైతులు మూడేళ్లుగా పోరాటం చేస్తుండగా.. తాజాగా దక్షిణ భాగంలోనూ ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం హైదరాబాద్ మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట ఉత్తరభాగం భూ నిర్వాసితులతో కలిసి దక్షిణభాగంలోని పలు మండలాల రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. తమ బతుకులను రోడ్డున పడేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు వద్దేవద్దంటూ హెచ్‌ఎండీఏ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
అలైన్‌మెంట్ మార్పుపై ఆగ్రహం
తొలుత రూపొందించిన ఆలైన్‌మెంట్ కాకుండా మరోప్రాంతం నుంచి అలైన్‌మెంట్ మార్చడంపై రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ సమీపంలో ఓ పరిశ్రమను కాపాడేందుకు, భువనగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం రాజకీయ నేతలు, అధికారులు కుమ్మకై ్క అలైన్‌మెంట్ మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు, చౌటుప్పల్ మండలాల్లో జాతీయ రహదారుల వెంబడి ఎకరం రూ.4 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య దూరం నిబంధనల ప్రకారం 40 కిలో మీటర్లు ఉండాల్సి ఉన్నా దాన్ని 28 నుంచి 30 కిలో మీటర్లకు కుదించారు. అలైన్‌మెంట్ మార్చడం వల్ల, భువనగిరి, చౌటుప్పల్ పట్టణాలు రెండు ముక్కలు కానున్నాయి. అదే విధంగా రాయగిరి, చౌటుప్పల్ వద్ద నిర్మించనున్న ఎలివేటెడ్ జంక్షన్ వద్ద గతంలో 70 –80 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ 180 ఎకరాలకు పైగా భూములు సేకరిస్తున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో చాలా మంది రైతులు తమకు జీవనాధారమైన, విలువైన భూములు కోల్పోతున్నారు. కొందరు గుంట భూమి లేకుండా కోల్పోతున్నారు.
ఉత్తర భాగంలో మొదలై..
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని ఉత్తర భాగంలో మొదలైన ఆందోళన కార్యక్రమాలు ఇప్పుడు దక్షిణ భాగానికి చేరాయి. ఉత్తర భాగంలో భువనగిరి, రాయగిరి, ఎర్రంబెల్లి, కేసారం గ్రామాల రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు దక్షిణ భాగంలో సంస్థాన్‌నారాయణపురం మండలంలో గుడిమల్కాపురం, చిమిర్యాల, కోతులాపురం, కంకణాలగూడెం, సర్వేల్, లింగవారిగూడెం, పుట్టపాక గ్రామాలు, నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ మండలం గట్టుప్పల్, తెరేట్‌పల్లి, మర్రిగూడ మండలంలోని బట్లపల్లి, దామర భీమనపల్లి, మర్రిగూడెం, నామాపురం, మట్టి చందాపూర్, సరంపేట, వట్టిపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
దక్షిణ భాగంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో భూముల సర్వే నంబర్లను అధికారులు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుత అలైన్‌మెంట్ ప్రకారంగా తమ విలువైన భూములను కోల్పోవాల్సి వస్తుందని, భూములివ్వడానికి సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పుట్టపాక, సర్వేల్ గ్రామాల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలైన్‌మెంట్ మార్చాలంటూ రైతుసంఘాల ఆధ్వర్యంలో పోరాటానికి శ్రీకారం చుట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, పుట్టపాకలో రాస్తారోకో చేశారు. ఆదివారం సంస్థాన్‌నారాయణపురం, గట్టుప్పల్ మండలాల పరిధిలోని భూ నిర్వాసితులు సంస్థాన్‌నారాయణపురంలో సమావేశం అయ్యారు. వీరికి అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు.
మా భూములు లాక్కోవద్దు
చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం: రీజినల్ రింగ్‌రోడ్డు భూనిర్వాసితులు మరోసారి కదంతొక్కారు. ఉత్తర, దక్షిణ భాగాలకు చెందిన 8 జిల్లాల రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్లి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు వారిని లోనికి అనుమతి ఇవ్వకపోవడంతో కార్యాలయ ప్రాంగణంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత కార్యాలయం వద్ద నుండి వెళ్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరి ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. అన్యాయాన్ని సరిచేయకుండా నోటిఫికేషన్లు విడుదల చేయడం సరికాదన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు గుండెలు ఆగిపోయాయని, ఇంకెంతమంది ప్రాణాలను బలిగొంటారని నిలదీశారు.ఎంతవరకైనా పోరాడుతామని, భూములు మాత్రం ఇవ్వబోమన్నారు.అనంతరం హెచ్‌ఎండీఏ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, భూ నిర్వాసితులు, నాయకులు బోరెం శేఖర్‌రెడ్డి, దబ్బటి రాములు, గుజ్జుల సురేందర్‌రెడ్డి, సుర్వి యాదయ్య, బోరెం ప్రకాష్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్‌గౌడ్, జాల శ్రీశైలం, పల్లె శేఖర్‌రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, నాగెళ్లి దశరథ, జాల జంగయ్య, శశికళ, పాండుయాదవ్, జోసెఫ్, అనిల్, కృష్ణ, పల్లె పుష్పారెడ్డి, ఐతరాజు రాములు, నెల్లికంటి రాములు, నాగరాజు , ఐతరాజు గాలయ్య, దొంతగోని పెద్దులు, అంజయ్య పాల్గొన్నారు.
భూములిచ్చే ప్రసక్తే లేదు
నాకు నాలుగు ఎకరాల సాగు భూమి ఉంది. అదే నాకు జీవనాధారం. రీజి నల్ రింగ్ రోడ్డులో నా లుగు ఎకరాలు పోతుంది. నమ్ముకున్న భూమి పోతే తర్వాత జీవనోపాధి ఎలా. ఎంతవరకైనా పోరాడుతాం కానీ భూమి ఇచ్చే ప్రసక్తే లేదు. సాగు జలాలు అందితే బంగారు పంటలు పండుతాయి.
–నెల్కంటి రాములు, పుట్టపాక
రైతుల ప్రాణాలు తీయొద్దు
నాది 5 ఎకరాల భూమి పోతుంది. మా భూమి పక్క రైతు ఇటీవల ఎకరం రూ.2 కోట్లకు విక్రయించాడు. ఇంత విలువైన భూమికి ప్రభుత్వం రూ.22.50 లక్షలు పరిహారం ఇస్తానంటుంది. కొందరి ప్ర యోజనాల కోసం అలైన్‌మెంట్ మార్చారు. చౌటుప్పల్ మండలం చిన్నాభిన్నం అవుతుంది. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి. దౌర్జన్యంగా భూములు లాక్కొని రైతుల ప్రాణాలు తీయొద్దు. –బోరం ప్రకాష్‌రెడ్డి, మందోల్లగూడెం
ఔటర్ నుంచి 40 కిలో మీటర్ల దూరం నిబంధన పాటించాలి. అంతేకానీ చౌటుప్పల్ వద్ద 32 కిలో మీటర్లు, నారాయణపురం మండలం వద్ద 30 కిలో మీటర్ల దూరం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. తక్కువ దూరం నుంచి వెళ్లడం వల్ల నారాయణపురం మండలంలో ఎ క్కువ భూములు పోతున్నాయి. మాది భూమి మిగిలే అవకాశమే లేదు.
–పల్లె పుష్పారెడ్డి, సంస్థాన్‌నారాయణపురం మండలం ఫార్మర్ ఫెడరేషన్ చైర్మన్
ఫ వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు
ఫ హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద
ధర్నా, రాస్తారోకో
ఫ ఇప్పటికే ఉత్తర భాగంలో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరాటం