
గణేష్ ఉత్సవ ఖర్చు రూ.193 కోట్లు!
ఎక్కడా తగ్గలేదు
భువనగిరి : గణేశ్ నవరాత్రి ఉత్సవాలంటే తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని పూజించడమే కాదు.. తమ కమిటీ గొప్పతనాన్ని, సత్తాను చాటే ప్రదర్శనగా మారింది. ఐక్యత, భక్తిప్రవత్తుల కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు ఆర్భాటం, హంగామా చాటుకునే వేదికగా మారుతున్నాయి. భక్తులు పోటాపోటీగా నిర్వహించిన ఈ ఉత్సవాలకు నిర్వాహకులు రూ.193 కోట్లకు పైగా ఖర్చు చేశారు. వినాయక విగ్రహాల కొనుగోలు మొదలు నిమజ్జనం చేసే వరకు ప్రతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఎక్కడా తగ్గ లేదు.
సుమారు 4,826 వినాయక విగ్రహాలు
గత నెల 27వ తేదీన వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో పల్లెలు, పట్టణాల్లో వాడవాడనా విగ్రహాలు ఏర్పాటు చేశారు. భువనగిరిలో 286 విగ్రహాల వరకు ఏర్పాటు చేయగా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూర్‌తో పాటు జిల్లావ్యాప్తంగా ఈ సారి 4,826 గణనాథులను నెలకొల్పారు. ఇందులో 6 అడుగుల ఎత్తునుంచి 25 అడుగుల ఎత్తు విగ్రహాలు ఉన్నాయి. వీటిలో రూ.10 వేల నుంచి రూ.1.30 లక్ష వరకు విలువ చేసే విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను చాలా వరకు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చారు.
ఉత్సవాల నిర్వహణ ఇలా..
ఆధ్యాత్మిక ఊట్టిపడేలా, వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా మండపాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పూజారితో పూజలు, పూజా సామగ్రి కొనుగోలు, అన్నదానాలు, మైకుసెట్, భజన కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనం రోజు మహారాష్ట్ర, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కళాకారులచే ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించారు.
వెనుకాడని ఉత్సవ కమిటీలు
ఒక్కో వినాయకునికి సగటున రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. దీని ప్రకారం 4,826 మండపాల వద్ద సుమారు రూ.193 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటీలు అంటున్నాయి. అత్యధి కంగా రూ.48 కోట్లు, మండపాలకు రూ.24 కోట్లు, పూజారులకు రూ.28లక్షలు,అన్నదానాలకు రూ.38. 60 లక్షలు, సౌండ్ బాక్స్‌లు రూ.28.50 లక్షలు, రవాణా చార్జీలు రూ.4.86 లక్షలు, పూజాసామగ్రి రూ.2 లక్షలు, ఇతరత్రా ఖర్చులకు మిగిలినవి వెచ్చించారు.
మండపాల నిర్వహకులు ఆధ్యాత్మికతను చాటేందుకు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఒక్కో మండపం వద్ద రూ.లక్షల్లో ఖర్చు చేశారు. భారీ విగ్రహాలతో పాటు ఆకర్షణీయంగా మండపాలు ఏర్పాటు చేసిన వారు రూ.8నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. సాధారణ మండపాల వద్ద రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. –రత్నపురం శ్రీశైలం,
భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు
ఫ 4,826 విగ్రహాలకు రూ.48 కోట్లు
ఫ మండపాలకు రూ.24 కోట్లు
ఫ అన్నదానం, పూజా సామగ్రి ఇతర వ్యయం భారీగానే..