
10న తుది ఓటరు జాబితా వెల్లడిస్తాం
సాక్షి,యాదాద్రి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూ చించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10న తుది జాబితా వెలువరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభా రాణి తదితరులు పాల్గొన్నారు.
వైద్యశిబిరాలతో గ్రామీణ ప్రజలకు మేలు
బొమ్మలరామారం: కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పాటు చేసే వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ అన్నారు. బొమ్మలరామారం మండలంలోని జలాల్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సుధీర్‌బాబు, వైస్ చైర్మన్ సుధాకర్‌ల మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సోమ, మంగళవా రాల్లో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యశిబిరంలో బసవతార కం క్యాన్సర్ ఆస్పత్రి, జీనియా, ఈన్‌టీ పోలీస్ ఐ ఆస్పత్రి, స్మైల్‌గార్డ్ ఆస్పత్రుల వైద్యులు సేవలందించారు. ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ రాహుల్‌రెడ్డి, డీఈఓ సత్యనారాయణ, సీఐ చంద్రబాబు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రఘువీర్, జాయింట్ సెక్రటరీ వాసుదేవ్, చీఫ్ కో ఆర్డినేటర్ సావిత్రి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, ఎంఈఓ రోజారాణి, హెచ్‌ఎం పగిడిపల్లి నిర్మల జ్యోతి, మాజీ సర్పంచ్ మోటే గట్టయ్య, విజయ్‌కుమార్ రెడ్డి, డాక్టర్ రేణుక, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
ఆలేరు: ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణకు రాష్ట్ర ఉత్తమ ఐటీఐ ప్రిన్సిపాల్ అవార్డు దక్కింది. సోమవారం కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లకిడికాపూల్‌లోని తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్‌ల చేతుల మీదుగా హరికృష్ణ అవార్డుతో పాటు ప్రశంసపత్రాన్ని అందుకున్నారు. అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.