
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ భువనగిరి, : ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. ముగ్గురికి ఉపాధ్యక్ష పదవులు దక్కగా, మరొకరికి రాష్ట్ర కార్యదర్శి, ఇంకొకరికి ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆమోదంతో రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, జరుప్లావత్ గోపి (కళ్యాణ్‌నాయక్)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా తూటుపల్లి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భువనగిరికి చెందిన వేముల అశోక్‌కు అవకాశం కల్పించారు. రవికుమార్ గతంలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఒడిపోయారు.
సంజయ్ అనుచరుడిగా ముద్ర పడినందుకేనా..
ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా వ్యవహరించే గంగిడి మనోహర్‌రెడ్డికి ఈసారి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో అనేక సంవత్సరాలు పనిచేసిన ఆయన గతంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ బాధ్యతల్లో చాలా కాలం సేవలందించారు. కాగా, బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా మనోహర్‌రెడ్డి వ్యవహరించారాని, రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించకుండా కొందరు ఎంపీలే నడ్డాపై ఒత్తిడి చేశారని అనుచరులు మండిపడుతున్నారు. దీనిపై మనోహర్‌రెడ్డి స్పందిస్తూ.. కార్యవర్గంలో తన పేరు లేకపోవడం వాస్తవమేనని, పార్టీ తన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందేమోనని పేర్కొన్నారు. క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఫ సీనియర్ నేత గంగిడి మనోహర్‌రెడ్డికి దక్కని స్థానం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు