
ఏడాదిన్నరగా ఎదురుచూపుల్లోనే..
భువనగిరిటౌన్ : చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు 12,218 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
నిరుత్సాహంలో దరఖాస్తుదారులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహ పడుతున్నారు. పింఛన్‌దారులకు గత ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున అందించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే రూ. 4016కు పెంచుతామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణి కార్యక్రమంలోనూ మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు.
నిలిపివేస్తున్నారే తప్ప.. మంజూరేదీ?
వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు మృతి చెందితే వారి పింఛన్ నిలిపివేస్తున్నారే తప్ప.. అతని భార్య మాత్రం వితంతు పింఛన్ మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 12 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు విచారణకు నోచుకోకుండా కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి.
నెలకు రూ.25.24 కోట్లు
జిల్లాలో ప్రస్తుతం 98,650 మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు. వీరిలో వద్ధాప్య, వితంతు, వికలాంగుల, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.25.24 కోట్లు పంపిణీ చేస్తున్నారు.
నాకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఆసరా పింఛన్ కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలు ముగిసి కూడా ఏడాదిన్న కావస్తుంది. నేటికీ పింఛన్ మంజూరు కావడం లేదు. పంచాయితీ కార్యదర్శి, మండల పరిష్యత్ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించిన ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదన్నారు. పింఛన్ వస్తే ఆసరా అవుతుంది.
– పి.బాలనర్సయ్య, దరఖాస్తుదారుడు
చేయూత పింఛన్ కోసం 12వేలకు పైగా దరఖాస్తులు
ఫ నేటికీ వెలువడని మార్గదర్శకాలు
ఫ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
ప్రస్తుతం లబ్ధిదారులు ఇలా..
వృద్ధులు 36,820
వితంతు 36,797
దివ్యాంగులు 12,816
కొత్త దరఖాస్తులు 12,218

ఏడాదిన్నరగా ఎదురుచూపుల్లోనే..