
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం
భూదాన్‌పోచంపల్లి: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో నిర్వహించే వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని, అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించి ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ చైర్మన్ డాక్టర్ కిషోర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ చైర్మన్ కిషోర్‌రెడ్డి సమక్షంలో అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ డైరెక్టర్ హరికృష్ణ అవగాహన పత్రాలపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యయోజన పథకం ద్వారా అమలు చేస్తున్న వృత్తి విద్యా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణ, శిక్షణ పూర్తికాగానే ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు కల్పిస్తామని కిషోర్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, స్కిల్ డెవలప్‌మెంట్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ఈఎంఆర్‌ఆర్‌సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సోలమన్, ఆయా విభాగాల డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.