
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతిచెందింది. కనగల్లు మండలం తొరగల్లు గ్రామానికి చెందిన చింతపల్లి రాధిక–సైదులు దంపతుల కుమార్తె జస్విత(5) నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్‌లో గల మాస్టర్ మైండ్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతుంది. పాఠశాలకు చెందిన బస్సులో గురువారం ఉదయం పాఠశాలకు బయలుదేరింది. బస్సు పాఠశాలకు చేరుకున్న తర్వాత బస్సులోని విద్యార్థులంతా బస్సుదిగి వెళ్లారు. చివరగా జస్విత.. బస్సు ముందు నుంచి మరో ఇద్దరు బాలికలతో కలిసి వెళ్తుండగా గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో జస్విత బస్సు ఎడమ వైపు చక్రం కింద పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి జస్వితను పాఠశాల సిబ్బంది, అక్కడ ఉన్నవారు ఆటోలో దగ్గరోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ చెప్పాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జస్విత మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తల్లి రాధిక ఫిర్యాదుతో పాఠశాల బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
విద్యార్థి సంఘాల ధర్నా..
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు వేర్వేరుగా ధర్నా నిర్వహించి బాదిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాల సీజ్
నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి ఈ ఘటనపై ఆరాతీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు మాస్టర్‌మైండ్ పాఠశాలను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఫ పాఠశాల ఆవరణలోనే ఘటన