
యూట్యూబ్ ద్వారా ‘ఇన్ స్కూల్ యాక్టివిటీస్’
నాగారం: నాగారం మండలం వర్ధమానుకోటలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వర్దెల్లి మల్లయ్య ‘ఇన్ స్కూల్ యాక్టివిటీస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి గత ఏడేళ్లుగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సైతం ఉపయోగకరమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు నవోదయ, గురుకుల, సైనిక, స్పోర్ట్స్ పాఠశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలను సులభంగా బోధిస్తున్నారు. గణితం, ఇంగ్లిష్, తెలుగు, పరిసరాల విజ్ఞానం విషయాలకు సంబంధించి డిజిటల్ పాఠ్యాంశాల వీడియోలు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు నిత్యం ఉపయోగపడే ఆన్‌లైన్ రిపోర్టులు, వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన టీఎల్‌ఎంను సులభంగా తయారుచేసి, ఉపయోగించే విధానంపై అనేక వీడియోలు రూపొందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఫోన్ ద్వారా వివిధ రకాల ఆన్‌లైన్ కార్యక్రమాలు చేసుకోవడమే ఛానల్ యొక్క లక్ష్యమని ఆయన తెలిపారు.