
అధిక వర్షాలు.. ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
గుర్రంపోడు: గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పండ్లు, పూలు, కూరగాయల తోటల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. వరుస వర్షాలతో ఆశించే వ్యాధికారక శిలీంధ్రాలు, చీడపీడలను తగ్గించడానికి రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు టి. సురేష్‌రెడ్డి చెబుతున్నారు. ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఆయన మాటల్లోనే..
పండ్ల తోటల్లో..
అధిక వర్షాలకు కుంటలు, కాల్వలు, వరి సాగు ఉన్న చోట నీరు ఉబికి పండ్ల తోటల్లోకి రాకుండా చుట్టూ గాడి తవ్వుకోవాలి. చనిపోయిన మొక్కలను తొలగించి కొత్తవి నాటుకోవడం, వాలిపోయిన మొక్కలను సరిచేసి మొదలుకు మట్టిని ఎగదోసి కర్రతో ఊతమివ్వాలి. తర్వాత 19:19:19 నీటిలో కరిగే పాలీఫీడ్ ఎరువును ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మొక్క చుట్టూ మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని నేలలో ఇంకేలా పోయాలి. గాలులకు విరిగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించి చివర్లకు కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను పూయాలి లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. మామిడిలో చీడపీడల ఉధృతిని తగ్గించడానికి ఒక గ్రాము కార్భండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 10 గ్రాముల మల్టీకే మందును మరియు బోరాన్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కూరగాయ పంటల్లో..
పడిపోయిన కూరగాయ మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి నిలబెట్టాలి. మొక్కలు ఆకులు, కొమ్మలతో ఏపుగా ఉంటే 0.3 శాతం 13:0:45 నీటిలో కరిగే మల్టీకే లేదా రెండు శాతం యూరియా ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. ఆయా కూరగాయల రకాలను బట్టి అవసరమైన పురుగు నివారణ మందులు పిచికారీ చేయాలి.
మిరుప తోటల్లో..
వర్షాకాలంలో మిరుపలో వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి కలిపి నారుమడి మొత్తం పిచికారీ చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్భండింజమ్ ఒక గ్రామును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. మొక్కలు ఏపుగా పెరిగి ఉంటే 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
పూల తోటల్లో..
మొక్కలపై ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రాఫికొనజోల్ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 1–2 పర్యాయాలు పిచికారీ చేయాలి. కోతకు వచ్చిన పూలను వెంటనే కోయాలి. గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో పూలను నిల్వ చేయాలి.

అధిక వర్షాలు.. ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు