
15లోగా పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి,యాదాద్రి : సమాచార హక్కు చట్టం కింద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు ఈ నెల 15లోగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన గురువారం భువనగిరి వివేరా హోటల్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిటిషన్లు 18,000 పెండింగ్‌లో ఉండగా, వీటిలో ఇప్పటివరకు 2300 పిటిషన్లను పరిష్కరించామన్నారు. మొత్తం 29 డిపార్ట్‌మెంట్లలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లలో 15 శాఖల్లో క్లియర్ చేశామని చెప్పారు. మిగిలిన 14 శాఖల్లో దరఖాస్తులను పరిష్కరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ శాఖలో ఉన్న 50 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆయాశాఖలకు ఆదేశాలిచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లు విధిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట సహ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, నెర్ల వైష్ణవి మొహిసిన్ పర్వీన్ ఉన్నారు.
ఫ సమాచార హక్కు చట్టం
చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి