
చేనేతకు ప్రభుత్వాలన్నీ అన్యాయం చేశాయి
భూదాన్‌పోచంపల్లి: గత ప్రభుత్వాలన్నీ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ టి.చిరంజీవులు అన్నారు. గత పదేళ్ల కాలంలో రూ.18లక్షల 12వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు ఖర్చు చేసింది కేవలం రూ.229 కోట్లు మాత్రమేనని అన్నారు. అలాగే ఈ సంవత్సరం 50లక్షల 512 వేల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా చేనేతకు రూ.2400 కోట్లు కేటాయించడం దయనీయ పరిస్థితికి అద్దంపడుతోందని అన్నారు. గురువారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవులు పాల్గొని మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదన్నారు. అదే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బడాపారిశ్రామిక వేత్తలకు రూ.16లక్షల 24వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. 1950 నుంచి ఇప్పటి వరకు 23 మంది మాత్రమే పద్మశాలీలు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. వాస్తవానికి 69 మంది ఎమ్మెల్యే కావాలన్నారు. అందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది చేనేత కార్మికులను సన్మానించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, చేనేత నాయకులు భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, సీత శ్రీరాములు, భోగ భానుమతి, కర్నాటి అంజమ్మ, మెరుగు శశికళ, కార్మిక సంఘం నాయకులు హరిశంకర్, భూషణ్, బిట్ల గణేశ్, రుద్ర సూర్యప్రకాశ్, వేణుకుమార్, శ్యామ్‌సుందర్, కూరపాటి భాస్కర్, శివరాజు, రాజేశ్వరీ, హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు