
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కోదాడరూరల్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం కోదాడ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణ పరిధిలోని చేపల మార్కెట్ వెనుక కట్టబజార్‌కు చెందిన ఉప్పతల శ్రీను, లక్ష్మి(40) దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. శ్రీను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మిని శ్రీను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. మూడు రోజుల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోవడం లేదు. బుధవారం రాత్రి వారి కుమార్తె హాసిని, బంధువుల పాప కలిసి ఓ గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన లక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుమార్తె హాసిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. శ్రీను మరో మహిళతో వివాహేత సంబంధం పెట్టుకొని లక్ష్మిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.
పెళ్లి కుదరడం లేదని బలవన్మరణం
డిండి: పెళ్లి కుదరడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం డిండి మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రంలోని డీఎన్‌టీ కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మయ్య, జంగమ్మ దంపతుల కుమార్తె రూప(26) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టుమిషన్ నడుపుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు రూపకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రూప బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం పోలీసులు ఘుటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.