
నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
భువనగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 7.10 గంటలకు బీబీనగర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం గుట్టలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ నివాసానికి వెళ్లనున్నారు. ఆ తరువాత చేనేత దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్టలో చేనేత సహకార సంఘంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. 11.45 గంటలకు భువనగిరికి వస్తారు. పట్టణంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగే జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవతంం చేయాలని కోరారు.
యాదగిరి క్షేత్రంలో సీసీ కెమెరాల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ వెంకట్‌రావును కలిసి భక్తులు, ఆలయ భద్రతపై చర్చించారు. ఆయన వెంట పట్టణ సీఐ భాస్కర్, ఎస్‌పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నేడు పోచంపల్లికి దత్తాత్రేయ రాక
భూదాన్‌పోచంపల్లి: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భూదాన్‌పోచంపల్లికి రానున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సహకార సంఘం భవనంలో చేనేత కార్మికులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించనున్నారు. అదే విధంగా కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పో చంపల్లి చేనేత సంఘం నాయకులు తెలిపారు.
గుట్టలో ఫుడ్ ఫెస్టివల్
యాదగిరిగుట్ట: వంద రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక అంగడిబజార్‌లో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళా సంఘాలు, మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారులు ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు హాజరై వంటకాలను రుచి చూశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, అధికారులు ఉన్నారు.

నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు