
ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు
నడిగూడెం: కాలానుగుణంగా వ్యవసాయంలో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడంతో పాటు కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విత్తనాలు వేసే దగ్గర నుంచి ఎరువుల వాడకం, కలుపు తీయడం, పంట కోసే వరకు ఒక్కో రైతు ఒక్కో విధంగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపుంర గ్రామ రైతులు మాత్రం అందుకు భిన్నం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రామాపురం రైతులు వరి సాగు భిన్నంగా చేపట్టారు. దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా చల్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఊళ్లోని రైతులంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. రామాపురంలో బోర్లు, బావులు, సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా కొమరబండ మేజర్ కాల్వ, ఆర్–9 ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీటి సౌకర్యం ఉంది. ఉన్న నీటి వనరులతో ఏకంగా ఆ ఊరంతా దాదాపు 3500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ విధానంలో వారం రోజుల ముందుగానే పంట కోతకు వస్తుందని, నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు రూ.2500 నుంచి రూ.3500 వరకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో కాండం ధృడంగా పెరుగుతుందని, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా సాగు చేసుకోవచ్చని, నీటి యాజమాన్యం కూడా చాలా సులువు అని వ్యవసాయాధికారులు అంటున్నారు.
మూడెకరాల్లోనూ వెదజల్లే పద్ధతిలో..
మూడెకరాల్లో వరి సాగు చేపట్టాను. అది కూడా వెదజల్లే పద్ధతిలో నేరుగా వరి విత్తనాలు చల్లాను. దీంతో విత్తన మోతాదు, నారు పెంచే ఖర్చులు, నాట్లు వేసే ఖర్చులు తగ్గాయి. దాదాపు రూ.3000 వరకు ఆదా అయ్యాయి. కూలీల సమస్య కూడా లేదు.
– మారిశెట్టి నర్సింహారావు, రైతు, రామాపురం
వెదజల్లే పద్ధతి చాలా సులువు
రోజురోజుకూ వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ముందుకు వెళ్లాఇ. దమ్ము చేసిన తర్వాత నేరుగా పొలంలో విత్తనాలు వెదజల్లడం వలన మొక్క ధృడంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కూలీల సమస్యను కూడా అధిగమించవచ్చు. – రాయపు దేవప్రసాద్,
మండల వ్యవసాయాధికారి, నడిగూడెం
ఫ భిన్నంగా ఆలోచించిన
నడిగూడెం మండలం
రామాపురం గ్రామ రైతులు
ఫ పెట్టుబడి ఖర్చులు తగ్గి కూలీల కొరత లేదంటున్న అన్నదాతలు

ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు

ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు

ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు