
ముగిసిన పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ముగిశాయి. ఈ నెల 4వ తేదీన ఆలయంలో శ్రీస్వామి వారి పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. రెండ్రోజుల పాటు ఆలయంలో వివిధ పూజలు నిర్వహించిన అర్చకులు, బుధవారం ఉదయం ప్రాకార మండపంలోని యజ్ఞశాలలో హోమాధి పూజలు జరిపించి, మహా పూర్ణాహుతి చేపట్టారు. ఉదయం 8.30గంటల నుంచి ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర, పరివార శాంతి, ప్రాయశ్చిత హోమం, శాలాబలి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను, పవిత్రమాలలను ఊరేగింపుగా ప్రధానాలయానికి తీసుకెళ్లారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులు, సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులు, ఆళ్వారులకు పవిత్ర మాలలను ధరింపజేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. వేడుకల్లో ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చకులు, పారాయణీకులు, పండితులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో సైతం పవిత్రోత్సవాలను వైభవంగా ముగించారు.
నేటి నుంచి నిత్యపూజలు పునఃప్రారంభం
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాల సందర్భంగా మంగళ, బుధ వారాల్లో శాశ్వత, నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి ఈ పుజలను పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ముగిసిన పవిత్రోత్సవాలు