
నారుమడిపై కలుపు మందు పిచికారీ
నడిగూడెం : మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన గుండు సుభద్ర వ్యవసాయ క్షేత్రంలోని వరి నారుమడిపై గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో ఆమె బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్.చంద్రశేఖర్, డాక్టర్ సంధ్యారాణిలను పిలిపించి, నారుమడిని పరిశీలించి, పొలంలోని నారు, మట్టి నమూనాలు సేకరించినట్లు ఎస్‌ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్, ఏఈఓ ఉప్పయ్య ఉన్నారు.
ఆర్‌ఎంపీ వైద్యుడిపై
కేసు నమోదు
మునగాల: మునగాల మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చంద్రమౌళి చేసిన చికిత్స వికటించడంతోనే బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు(35) మృతిచెందాడని ఆయన సోదరుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ బుధవారం తెలిపారు. వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా అతడి భార్య శిరీష మంగళవారం మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు చంద్రమౌళి క్లినిక్‌కు చికిత్స నిమిత్తం తీసుకువచ్చింది. చికిత్స పొందుతుండగా వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో ఆయన సోదరుడు వీరబాబు సాయంతో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మునగాలతో పాటు మృతుడి స్వగ్రామమైన బరాఖత్‌గూడెంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
చింతపల్లి: అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వింజమూర్ గ్రామానికి చెందిన భీనమోని మహేందర్ (35)గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు డ్రైవర్ గా చేస్తూ జీవనం సాగించేవాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో గత నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. బంధువులు గమనించి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

నారుమడిపై కలుపు మందు పిచికారీ