
విద్య నేర్పుతూ.. కళను పంచుతూ..
తిప్పర్తి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు తనకున్న కళను విద్యార్థులకు పంచుతున్నాడు తిప్పర్తి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జల్లెల వెంకటేశ్వర్లు. చిత్రలేఖనం ద్వారా అర్థమయ్యే రీతిలో విద్యా బుద్ధులు నేర్పించడంతోపాటు, యోగా, కోలాటం తదితర రంగాల్లో విద్యార్థులకు మెళకువలు నేర్పుతూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
ఉద్యోగం వచ్చిన నాటి నుంచి నేటి వరకు..
గత 24 సంవత్సరాల సర్వీసులో ఇప్పటి వరకు మూడు పాఠశాలల్లో పనిచేశారు. ప్రథమంగా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామం నుంచి తన ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. అక్కడ నుంచి అనుముల మండల కుపాస్‌పల్లిలో చేశాడు. ప్రస్తుతం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 27 పాఠశాలలో చిత్రాలు గీశారు. తాను పనిచేసిన పాఠశాలలోనే కాకుండా ఇతర పాఠశాలలకు కూడా ఆహ్వానం మేరకు వెళ్లి చిత్రాలు గీశారు. 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. రాష్ట్ర కార్టూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన గీసిన చిత్రాలు పాఠ్యపుస్తకాల్లో ప్రచురితమయ్యాయి. పీవీ నర్సింహరావు శత జయంతి సందర్భంగా ఆయన గీసిన చిత్రానికి 2023లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో అవార్డు అందుకున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు గీసిన చిత్రాలు ఆస్ట్రేలియాలో తెలుగు అసోసియేషన్ రూపొందించిన 2024 క్యాలెండర్‌లో ప్రచురితమయ్యాయి.
నా కళను విద్యార్థులకు పంచుతున్నా
నాకు చిన్నతనం నుంచి చిత్రలేఖనం ఎంతో ఇష్టం. నేను పనిచేస్తున్న పాఠశాలతో పాటు వేరే పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చిత్రాలను గీశాను. రాజకీయ నాయకులు, దేశ నాయకులు చిత్రాలను గీసి వారికి బహుమతులుగా అందజేశాను.
– వెంకటేశ్వర్లు,
తిప్పర్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు
ఫ విద్యార్థులకు చదువుతోపాటు
చిత్రలేఖనం, యోగా, కోలాటంలో శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయుడు

విద్య నేర్పుతూ.. కళను పంచుతూ..