జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జాం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జాం

Aug 6 2025 6:10 AM | Updated on Aug 6 2025 6:10 AM

జాతీయ రహదారిపై  ట్రాఫిక్‌ జాం

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జాం

ఇబ్బందులు పడిన వాహనదారులు

చౌటుప్పల్‌ రూరల్‌: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట గ్రామంలో ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి నల్లగొండ వైపు నుంచి సిమెంట్‌ లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ తూప్రాన్‌పేట గ్రామంలో హైవేపై మరమ్మతులకు గురైంది. హైవేపై పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ట్రాఫిక్‌ జాం కాకుండా వాహనాలను పంపించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడంతో మధ్యాహ్నం వరకు తూప్రాన్‌పేట గ్రామంలో హైదరాబాద్‌ వెళ్లే వైపు సుమారు 2 కి.మీ. మేర ట్రాఫిక్‌ జాం అయ్యింది. దీంతో హైదరాబాద్‌ వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ట్రాఫిక్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని రోడ్డు పక్కకు తొలగించడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలిలాయి.

రోడ్డు ప్రమాదంలో

కానిస్టేబుల్‌ దుర్మరణం

చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి బైక్‌ వస్తున్న కానిస్టేబుల్‌ ట్రాక్టర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్‌ తండా గ్రామానికి చెందిన ధరావతు సోమాని(55) సూర్యాపేట సబ్‌ జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై సూర్యాపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం వద్ద మండల కేంద్రం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. వెనుక నుంచి బైక్‌పై వస్తున్న సోమాని అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న మరో బైక్‌ సోమాని పైనుంచి వెళ్లడంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ తెలిపారు.

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

వలిగొండ: వలిగొండ మండలం ఏదుళ్లగూడెం రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజపూర్‌కు చెందిన గుళ్ళని పోచమ్మ (90) ఏదుళ్లగూడెంలో తన బంధువుల ఇంటికి వస్తుండగా.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచి ఉండడంతో బ్రిడ్జి పైనుంచి రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement