
నకిరేకల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 300మంది పోలీస్ సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తాటికల్ రోడ్డులోని ఎస్సీ కాలనీ, వడ్డెర కాలనీ, మొండివారి కాలనీల్లోని ఇళ్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, గంజాయి అనుమానితులను, వివిధ కేసుల్లో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ముగిసిన తర్వాత నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ నకిరేకల్‌కు చేరుకుని తాటికల్ రోడ్డులోని ఎస్సీ కమ్యూనిటీ హల్ నందు ఉంచిన పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ముందుస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలను సమన్వయం చేస్తూ శాంతిభద్రతలను కాపాడటం కోసం కార్డెన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 130 బైక్‌లు, 10 ఆటోలు, మరో 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 8 మంది పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 18 మంది గంజాయి అనుమానితులను కూడా పట్టుకున్నామన్నారు. ముగ్గురు నేపాల్ దేశస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఒక షెడ్డులో 15 గోవులను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఆయా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం, చండూరు, నల్లగొండ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల సీఐలు కొండల్‌రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, వివిధ మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
300 మంది పోలీసులతో సోదాలు
250 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
గంజాయి అనుమానితుల అరెస్ట్
పాత నేరస్తుల గుర్తింపు