
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● మహిళ మృతి ● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
చౌటుప్పల్ రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామానికి చెందిన మద్దిరాల ప్రవీణ్‌కుమార్ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నివాసం ఉండడానికి ఇల్లు చూసుకున్నాడు. తన తల్లి గోవిందమ్మ(62), భార్య సుమతితో కలిసి అద్దె ఇంట్లో దిగేందుకు స్వగ్రామం చిరుకూరుపాడు నుంచి సోమవారం రాత్రి 9గంటలకు కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో మంగళవారం తెల్లవారుజామున చౌటుప్పల్ దాటిన తర్వాత బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందు సీట్లలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్, అతడి భార్య సుమతికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లులో కూర్చున్న ప్రవీణ్ తల్లి గోవిందమ్మకు ఛాతి భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరిది మద్దిరాల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారరిపై ట్రాఫిక్‌జాం కావడంతో సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.