
రిమాండ్‌కు తరలించాలని ఎస్పీకి ఫిర్యాదు
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని మృతుడి సోదరుడు సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను ప్రజావాణి కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేశాడు. మృతుడి సోదరుడు బొప్పని దావీదు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన బొప్పని గురవయ్య బండమీది చందుపట్ల గ్రామంలోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండగా.. అతడి భార్య ధనలక్ష్మి అదే గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గురువయ్యకు, అతడి కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు ధనలక్ష్మిని మందలించారు. దీంతో ఎలాగైనా తన భర్త గురవయ్య అడ్డు తొలగించుకువాలని భావించిన ధనలక్ష్మి, తన ప్రియుడు వడ్డేపల్లి రాజుతో కలిసి జూలై 12న సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ గురువయ్యను కొట్టి చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా గడ్డి మందు తాగించారు. విషయం తెలుసుకున్న గురువయ్య కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌కు తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 14వ తేదీన మృతిచెందాడు. జులై 16న సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా.. ధనలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు వడ్డేపల్లి రాజుపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గురవయ్య సోదరుడు దావీదు తెలిపారు.
ఇద్దరు కానిస్టేబుళ్లపై..
తిప్పర్తి: తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు ఓ బైక్ దొరకగా.. దానిని రిపేర్ చేయించి సర్వారం గ్రామానికి చెందిన వ్యక్తి అమ్మారు. అయితే బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ముందు మాట్లాడుకున్నట్లుగా మొత్తం డబ్బులు చెల్లించలేదు. దీంతో మొత్తం డబ్బులు ఇవ్వాలని అతడిపై కానిస్టేబుళ్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఎస్‌ఐకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ బైక్ రిపేర్ చేసిన మెకానిక్‌ను పిలిపించి విచారించగా.. అతడు బైక్ వివరాలను చెప్పాడు. ఇద్దరు కానిస్టేబుళ్లపై జిల్లా ఎస్పీకి నివేదిక పంపించామని, వారిపై ఎస్పీ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐ తెలిపారు.
మహాశివుడికి అభిషేక పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండ పైన యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు జరిపించారు. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజ లను కొనసాగించారు. సుదర్శన నారసింహ హో మం, నిత్య కల్యాణం, జోడు సేవ జరిపించారు.