
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: అతివేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కన నిల్చున్న యువకుడిని ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన కన్నెకంటి నరసింహాచారి(31) పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెయింటింగ్ పనులు ముగించుకుని రాత్రి 11:15 గంటలకు రాజీవ్‌చౌక్ సమీపంలో రోడ్డు పక్కకు తన బైక్‌ను పార్కింగ్ చేసి నిల్చున్నాడు. అదే సమయంలో గుంటూరు నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కన నిల్చున్న నరసింహాచారిని ఢీకొట్టింది. దీంతో అతడి తల చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి లారీని అడ్డగించారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహాచారి తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా.. అతడి మేనమామ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.