
ప్రేమించిన యువతి మోసం చేసిందని..
మిర్యాలగూడ అర్బన్: ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కేశబోయిన సైదులు, సుజాత దంపతుల పెద్ద కుమారుడు కేశబోయిన కార్తీక్(26) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కార్తీక్ ఓ యువతిని ప్రేమించి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల వద్ద ఉంటున్న సదరు యువతి గత కొద్దిరోజులుగా కార్తీక్‌కు ఫోన్ చేయకపోవడంతో పాటు రెండు రోజుల క్రితం మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు కార్తీక్‌కు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే కార్తీక్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య