
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ
సాక్షి, యాదాద్రి: జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. వలిగొండ మండలం సంగెం ఐకేపీ సెంటర్‌లో రూ.4.64 లక్షల విలువైన ధాన్యం గోల్‌మాల్ జరిగింది. కేంద్ర నిర్వాహకురాలు, సిబ్బంది, వలిగొండ పీఏసీఎస్ సీఈఓ, మిల్లర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా భూదాన్‌పోచంపల్లి మండలంలోని రుద్రవెళ్లి, చిన్నరావులపల్లి, బీబీనగర్ మండలం రాఘవాపురం కొనుగోలు కేంద్రాల్లో నూ విచారణ చేశారు. వీటితో పాటు బకాయి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)పైనా విచారణ చేశారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ ఇంకా 29 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది. బకాయిపడ్డ భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్, మోత్కూరు మండలం ఎల్.ఎన్.రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో విచారణ చేశారు. రికార్డులను పరిశీలించారు. సివిల్ సప్లై డీఎం నుంచి వివరాలు సేకరించారు.