
పరిషత్‌కు రెడీ!
అధికారులు, సిబ్బంది
6,889 మంది
600 ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఎంపీటీసీ స్థానానికి రిటర్నింగ్ అధికారి, ఏఆర్‌ఓ ఉంటారు. అదేవిధంగా 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లుండే కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. 401 నుంచి 600 ఓటర్లు ఉండే పోలింగ్ బూత్‌లో ఒక ప్రిసైడింగ్, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. మొత్తం 5,734 మంది అవసరం కాగా.. అదనపు సిబ్బంది 1,115తో కలిపి 6,889 మందితో తాజాగా జాబితా రెడీ చేశారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
సాక్షి, యాదాద్రి: పరిషత్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఈనెల 10 తరువాత ఏ క్షణమైనా వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, నామినేషన్ పత్రాలు, అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు కౌంటింగ్‌కు కేంద్రాలను ఖరారు చేయగా.. మరోమారు అప్‌డేట్ చేసుకుంటుంది.
రెండు దశల్లో ఎన్నికలు
జిల్లాలో 178 ఎంపీటీసీ, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు జెడ్పీటీసీ స్థానాలు, వీటి పరిధిలోని 84 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండవ విడతలో భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట జెడ్పీటీసీ స్థానాలు, వీటి పరిధిలోని 94 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదించారు.
మరోసారి ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 10 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటికే పూర్తి చేసిన ఏర్పాట్లను, పోలింగ్ సామగ్రిని అధికారం యంత్రాంగం సరిచూసుకుంటుంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ కలెక్టర్ పలుదఫాలు సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపించారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా యంత్రాంగం
ఫ ఇప్పటికే అందుబాటులో ఎన్నికల సామగ్రి
ఫ సిబ్బంది నియామకం పూర్తి
ఫ రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు
ఫ ఎన్నికల కమిషన్‌కు నివేదిక
ఆలేరు, భువనగిరిలో కౌంటింగ్ కేంద్రాలు
జిల్లాలో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు రెండు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలో ఎన్నికలు జరిగిన స్థానాలకు సంబంధించి ఆలేరులోని జేఎంజే స్కూల్‌లో ఓట్లు లెక్కించనున్నారు. రెండో విడత భువనగిరిలోని దివ్యబాల పాఠశాలలో కౌంటింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్స్‌లను అక్కడికి తరలించనున్నారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మండలాలకు ఎన్నికల సామగ్రిని చేరవేశాం. ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక కూడా పంపించాం.
–భాస్కర్‌రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

పరిషత్‌కు రెడీ!