
పలు చోట్ల భారీ వర్షం
నీట మునిగిన పొలాలు
బీబీనగర్: మండలంలోని రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి సాగు నీటి కాల్వలు పొంగిపొర్లాయి. దీంతో పలుగుతండా పరిధిలోని బొల్లేపల్లి కాలువ ఆయకట్టులో పంట పొలాల్లోకి నీరు చేరింది.
ఫ ఆలేరులో కూలిన విద్యుత్ స్తంభాలు
ఫ పోచంపల్లిలో రహదారులు జలమయం
ఫ ఆత్మకూర్(ఎం) పరిధిలో బిక్కేరుకు వరద ప్రవాహం, చెక్‌డ్యాంలకు జలకళ
ఆలేరు : జిల్లాలో పలుచోట్ల ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఆలేరు పట్టణంలో రెండుగంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఆలేరు బైపాస్, మంతపురి, కేవీపీకే, రఘనాథ్‌పురం మార్గాల్లో, కోలనుపాకలోని తొమ్మిది విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ వెంకటేష్ నేతృత్వంలో సిబ్బంది స్తంభాలను తిరిగి ఏర్పాటు చేసి కరెంట్ సరఫరాను పునరుద్దరించారు. పదో వార్డు ఎస్సీ కాలనీలోని మాతమ్మగుడి వద్ద చెట్టు కూలి గుడిసైపె పడటంతో దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికేమి ప్రమాదం జరగలేదు. పట్టణంలో 63.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే భారీ వర్షమని స్థానికులు పేర్కొంటున్నారు.
భూదాన్‌పోచంపల్లి: పట్టణంలో సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు వర్షం దంచికొట్టింది. వర్షానికి సినిమా థియేటర్ సమీపంలో మెయిన్‌రోడ్డుపై భారీగా నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచి తటాకాన్ని తలపించింది. 36.8 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆత్మకూర్(ఎం): మండలానికి ఎగువన కురిసిన వర్షానికి బిక్కేరు వాగు కల్వర్టుపైనుంచి ప్రవహించింది. వరద తగ్గేవరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొరటికల్ చెక్‌డ్యామ్ పూర్తిగా నిండింది.
పెద్దపలుగుతండా వద్ద
సాగు భూముల్లోకి చేరిన వరద నీరు

పలు చోట్ల భారీ వర్షం