
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
ఫ కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేయడానికి సుదూర ప్రాంతాలనుంచి వస్తుంటారని, ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. మొత్తం 71 అర్జీలు రాగా అత్యధికంగా 42 దరఖాస్తులు భూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, డీపీఓ సునంద తదితరులు పాల్గొన్నారు.
● బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ రాజ్‌కాళబైరవ ఆధ్వర్యంలో బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ కంఠానికి సంబంధించి రూ.79 కోట్లు, భూములు 200 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందన్నారు.