
ఆపదలో బంధువై..
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అండగా 108
అంబులెన్స్‌లో సౌకర్యాలు ఇవీ..
అత్యవసర రోగులు, బాధితులకు చికిత్స అందిస్తూ ఆస్పత్రికి చేర్చడానికి 108 అంబులెన్‌లో అవసరమైన అన్నిరకాల వైద్యపరికరాలు ఉంటాయి. గ్లూకోమీటర్, బీపీ ఆపరేటర్, థర్మామీటర్, క్రిమిసంహారక, ఇతర మందులు తాగిన వారికి చికిత్స అందించడానికి సక్షన్ ఆపరేటర్, గుండెపోటు బాధితులకు షాకింగ్ చికిత్స అందించడానికి కార్డియాక్ ఏఈడీ యంత్రం, ఆక్సీజన్, స్ట్రెచర్, కాలుచేతులు విరిగి లేవలేనివారికి స్కూప్ స్ట్రెచర్, ప్రమాదంలో వెన్నుపూస విరిగి కదలలేని వారికి స్పైన్ బోర్డు తదితర వైద్య పరికరాలు ఉంటాయి. ఆస్పత్రిలో చేర్చేవరకు ఆ పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు ఈఎంటీలు ప్రాథమిక చికిత్స అందిస్తారు.
మోత్కూరు : సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన చరణ్ మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి పండుగకు వచ్చాడు. తిరుగుప్రయాణంలో ఎదురుగా వచ్చిన ఆటో అతని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో చరణ్ కాలు విరగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులిచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్ 15 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈఎంటీ, పైలట్ బాధితుడికి అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందిస్తూ ఆస్పత్రికి చేర్చారు.. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రులకు చేరుస్తూ పునర్జన్మ ప్రసాదిస్తున్నాయి.. 108 అంబులెన్స్‌లు.
వేలాది మందికి పునర్జన్మ
జిల్లాలోని మోత్కూరు, గుండాల, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, తుర్కపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు కేంద్రాల పరిధిలో 108 అంబులెన్స్‌లు 12 ఉన్నాయి. ఇవి పల్లెలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో నిరంతర సేవలందిస్తున్నాయి. 2024–25 సంవత్సరంలో మొత్తం 22,492 మందికి సేవలందించాయి. అందులో మెడికల్ 15,562, గర్భిణులు 1,980, రోడ్డు ప్రమాద బాధితులు 2,915, గుండెనొప్పి 892, శ్వాస సంబంధ కేసులు 1,107 మందికి ప్రాథమిక చికిత్స అందించి సంఘటన స్థలం నుంచి సకాలంలో ఆస్పత్రులకు చేర్చాయి.
నిమిషాల్లో ఘటనా స్థలానికి
కుయ్..కుయ్‌మనే చప్పుడు వినిపించగానే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 108 అంబులెన్స్ పథకం ప్రవేశపెట్టారు. 108 కాల్ నుంచి ఎవరైనా ఆపదలో ఉన్నామని తెలియజేయగానే అంబులెన్స్ శరవేగంగా బయలుదేరుతుంది. పట్టణ మైతే 15 నిమిషాలు, పల్లె అయితే 20 నిమిషాలు.. మారుమూల ప్రాంతానికి అరగంటలోనే చేరుకుని బాధితులను ఆస్పత్రులకు చేరుస్తాయి. పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన అపరసంజీవనిగా పేరొందింది.
శిక్షణ పొందిన ఈఎంటీలు, పైలట్‌లు
బాధితులు ఎవరైనా 108కి కాల్ చేసి ఆపదలో ఉన్నామని తెలియజేస్తే దగ్గరలోని అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి 20 నిమిషాల్లోనే పంపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు అంబులెన్స్‌లోనే ప్రాథమిక వైద్యం అందిస్తారు. తుదపరి వైద్యం కోసం సకాలంలో ఆస్పత్రిలో చేర్చుతారు. ఇందుకోసం అంబులెన్స్‌లో శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), ఎంతవేగంతోనైనా వాహనాన్ని సురక్షితంగా నడిపించగల పైలట్ ఉంటాడు. జిల్లాలో ఈఎంటీలు, పైలట్‌లు 125 మంది ఉన్నారు.
బాధితులు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో
సంఘటనా స్థలానికి
చికిత్స చేయడంతో పాటు సకాలంలో ఆస్పత్రులకు తరలింపు
జిల్లా పరిధిలో 12 అంబులెన్స్‌లు
2024–25లో 22,492 మందికి సేవలు
ప్రతి వాహనంలో పైలట్, ఈఎంటీ
అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు, ప్రథమ చికిత్స
సేవలందిస్తున్న 125 మంది సిబ్బంది
జీపీఎస్ సహాయంతో
సేవలు మరింత మెరుగు

ఆపదలో బంధువై..