
యాదగిరి క్షేత్రానికి ఉత్సవ శోభ
● నేటి నుంచి పవిత్రోత్సవాలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవా రం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణా లతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాల సిద్ధం చేశారు.
విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం
సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
సర్వదోషాలు తొలగిపోవడానికి..
ఏటా శ్రావణమాసంలో శ్రీస్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగే నిత్యారాధనలు, వివిధ రకాల ఉత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చితార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. పవిత్రోత్సవాల్లో నాలుగు చతుర్వేద పారాయణాలు, మూలమంత్ర హవన పూజలు నిర్వహిస్తారు. వివిధ రంగుల్లోని పట్టు, నూలు పోగులకు ప్రత్యేక పూజలు, వేదమంత్రాల మధ్య పవిత్రాలను తయారు చేస్తారు. ఉత్సవాల్లో చివరి రోజు పవిత్రాలను శ్రీస్వామి వారికి సమర్పిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసమని అర్చకులు వెల్లడించారు. మొదటగా గర్భాలయంలోని మూలవర్యులు, ఉత్సవ మూర్తులకు పవిత్రాలను ధరింపజేస్తారు.
దోష నివారణకే పవిత్రోత్సవాలు
ఆలయంలో నిత్యారాధనలతో పాటు వివిధ రకాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల్లో మనకు తెలియకుండానే లోపాలు జరుగుతుంటాయి. వాటి నివారణకు ప్రాయశ్చిత్తంగా ఏటా శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో చతుర్వేద పారాయణంతో పాటు మూలమంత్రాలు, నారసింహ హవనం జరిపిస్తాం. ప్రత్యేక పూజలు చేసిన పట్టు, నూలు పోగులను స్వామి వారికి సమర్పిస్తాం. – కాండూరి వెంకటచార్యులు,
ప్రధానార్చకులు
ఆర్జిత సేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో 5, 6 తేదీల్లో శ్రీసుదర్శన నారసింహ హోమం, శాశ్వత, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన రద్దు చేశారు. 7వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

యాదగిరి క్షేత్రానికి ఉత్సవ శోభ