
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం, పరిసరాలు సందడిగా మారాయి. వేకుజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తును అభిషేకం, సహస్రనామార్చనలతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండిజోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు.