
నీటి విడుదలకు 58 ఏళ్లు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వలకు నీటిని విడుదల చేసి నేటికి 58 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థకసాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ మానవనిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి, నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. 1955 డిసెంబర్ 10 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల అనంతరం ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆనాడు రైతుల కళ్లలో ఆనందం తొనికిసలాడింది. కాల్వల్లో నీరు పారడంతో బీళ్లుగా ఉన్న భూముల్లో రైతులు సిరులు పండాయి. రైతులు ఆర్థికంగా బలపడ్డారు. తాగు, సాగునీటికి కొదవ లేకుండా పోయింది. ఆయకట్టుపరిదిలోని గ్రామాలు పట్టణాలుగా మారాయి. మిర్యాలగూడ,కోదాడ,ఖమ్మం లాంటి చిన్న చిన్నగ్రామాలు నేడు పెద్ద,పెద్ద పట్టణాలుగా రూపుదిద్ధుకున్నాయి. హాలియా, నేరెడుచర్ల, హూజూర్‌నగర్ లాంటి పల్లెలు నేడు ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధిపథంలో ఉన్నాయి. జనాభాపెరిగిన మేజర్‌గ్రామ పంచాయతీలు పురపాలక సంఘం నగరాలుగా మారాయి.
ఆశించిన మేర నెరవేరని లక్ష్యం
58 ఏళ్లు గడిచినా అనుకున్న స్థాయిలో ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు ఆధునీకరణలో కొన్ని ప్రాంతాలకు నీరు చేరువైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లోని కాలువల చివరి భూములకు నేటికి నీరందడం లేదు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ముందు చూపును దృష్టిలో పెట్టుకుని జలాశయం నుంచి నీటిని అదనంగా తీసుకునే అవకాశం ఉండే విధంగా కాలువ వెడల్పుగా తవ్వలేదు. మెయిన్ కాల్వ హెడ్ రెగ్యులేటర్ నుంచి డిస్ట్రిబ్యూటరీల హెడ్ రెగ్యులేటర్ల వరకు, తూములు వెడల్పు చేసి ఇన్‌టెక్ లెవల్‌ను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఆనాడు స్థిరీకరణలో తేలని భూములు నేడు సేద్యంలోకి వచ్చి ఆయకట్టు పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి అంచనా వ్యయం కేవలం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతులకే వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ గ్యాప్ ఆయకట్టుకు (టేల్యాండ్) నీరందక పోవడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ఆధునికీరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో రూ.4,444.44 కోట్లతో ప్రణాళిక తయారుచేసి పనులు ప్రారంభించారు. అయితే సమర్థులైన అధికారులు లేకపోవడంతో 2014లో పూర్తి కావాల్సిన పనులు జూలై 2016లో ముగిసాయి. అప్పుడే కాల్వలకు గండ్లు పడటంతో పాటు లైనింగ్ రూపురేఖలు మారాయి. ఈపనులన్నీ సమర్థవంతంగా పూర్తిచేస్తే, ప్రాజెక్టు లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరేది. కాలువల వ్యవస్థ, పారుదల సామర్థ్యం పెరిగి గ్యాప్ ఆయకట్టు సాగులోకి వచ్చేది.
1967 ఆగస్టు 4న సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ

నీటి విడుదలకు 58 ఏళ్లు