
సాగర్‌కు పర్యాటకుల తాకిడి
● సుమారు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
● మధ్యాహ్నం సమయానికి గేట్లు
మూసివేయడంతో నిరాశతో
వెనుదిరిగిన పర్యాటకులు
నాగార్జునసాగర్: కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు నాగార్జునసాగర్‌కు పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకులతో కిటకిటలాడింది. బుద్ధవనం నుంచి సాగర్‌డ్యాం దిగువనగల విద్యుదుత్పాదన కేంద్రం నుంచి రేడియల్ క్రస్ట్‌గేట్ల వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొత్త బ్రిడ్జి, విజయ విహార్, లాంచీస్టేషన్, బుద్ధవనం, పైలాన్‌లోని గ్యాలరీల రోడ్లు, పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు, బ్యాంకు పార్కు, పైలాన్ శంకుస్థాపన పిల్లర్ నుంచి బస్టాండు మీదుగా జెన్‌కో కార్యాలయం వరకు జనంతో కిటకిట లాడింది. బుద్ధవనం పరిసరాలు, పార్కులు, విజయవిహార్ వెనుక భాగం పార్కులో పర్యాటకులు భోజనాలు చేసి సేదతీరారు. లాంచీ విహారం చేసేందుకు సరిపోయేటన్ని లాంచీలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాంచీ టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. వాహనాల రద్దీ ఉండడంతో కొత్తబ్రిడ్జితోపాటు ఇటు ముత్యాలమ్మ గుడి వరకు వేరే రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు.