
వాహనాల బ్యాటరీలు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్టు
నల్లగొండ: వాహనాల్లో బ్యాటరీల చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరిని కనగల్ పోలీసులు అరెస్టు చేసినట్లు చండూరు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కేసు వివరాలను ఆదివారం కనగల్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. కనగల్ మండల పరిధిలోని కేబీ తండా గ్రామానికి చెందిన కోమటిరెడ్డి కరుణాకర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రం వద్ద తన మోటార్ సైకిల్‌ను పార్క్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను చోరీ చేశారు. దీంతో కనగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించారు. ఆదివారం ఉదయం పోలీసులు కనగల్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వీరిని చూసి వాహనం వెనుకకు తిప్పుకుని వెళ్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితులు నేరం అంగీకరించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్, రూ.లక్షా 45 వేలు విలువ చేసే 20 బ్యాటరీలు, రూ. 24 వేలు నగదు, ఆటో, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సముద్రాల కృష్ణ నల్లగొండలో ఉంటూ కూలి పని చేస్తుంటాడని, మరో నిందితుడు షేక్ టిప్పు సుల్తాన్ అలియాస్ సుల్తాన్ నల్లగొండలో ఉంటూ హౌష్ షిఫ్టింగ్ మూవర్, ప్యాకర్‌గా పని చేస్తాడని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన సబ్ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ రెడ్డి, పోలీసు సిబ్బంది రవీందర్‌రెడ్డి, వెంకన్న, శేఖర్, సురేశ్, రమేష్, వెంకట్ రెడ్డిని చండూరు సీఐ ఆదిరెడ్డి అభినందించారు.