
లా కాలేజీలో స్నేహితులయ్యారు
సాక్షి, యాదాద్రి: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఇద్దరి వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం 35 ఏళ్లుగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఏపూరి భాస్కర్‌రావు, హైదరాబాద్‌కు చెందిన టీ. వెంకటరమణ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో 1991 జూలై 12న ఒకే రోజు చేరారు. ఆనాడు వారి మధ్యన ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. భాస్కర్‌రావు ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలు రాసి రెవెన్యూ శాఖలో చేరారు. ప్రస్తుతం సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వెంకటరమణ న్యాయవాదిగా హైదరాబాద్‌లోని తార్నాకలో స్థిరపడ్డారు. భాస్కర్‌రావు ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ తన స్నేహితుడు వెంకటరమణకు అవసరమైన చోట అండగా ఉంటూ వస్తున్నారు. ఇద్దరం విధి నిర్వహణలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా వారానికి రెండు మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకుంటామని భాస్కర్‌రావు తెలిపారు.