
ఆపదలో ఆదుకుంటున్న ‘మిత్రమండలి’
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లిలో కొంతమంది స్నేహితులు, యువకులు కలిసి మిత్రమండలి పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను 2021లో ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా స్నేహితులంతా కలిసి ఆపదలో ఉన్న వారికి తమకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్సాయపల్లి గ్రామానికి చెందిన బాణోతు వీరన్న చెరువులో పడి మృతిచెందగా.. అతడి కుటుంబానికి మిత్రమండలి ఆధ్యర్యంలో రూ.30 వేలు ఆర్థికసాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పందిరి సైదులు కుటుంబానికి రూ.25 వేలు, అకాల మరణం చెందిన అంకిరెడ్డి రవి కుటుంబానికి రూ.30 వేలు, బైక్ పైనుంచి పడి మృతిచెందిన పూజరి సైదులు కుటుంబానికి రూ.27 వేలతో పాటు పలు కుటుంబాలకు మిత్రమండలి ఆధ్వర్యంలో ఆర్ధికసాయం అందించారు. అదేవిధంగా బాణోతు సాయి పేదరికంతో చదువు మధ్యలోనే మానేయడంతో అతడికి రూ.15 వేలు ఆర్ధికసాయం చేశారు. అంతేకాకుండా సామాజిక అంశాలపై వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్తులను చైతన్యపరుస్తున్నారు. రాజకీయాలకతీతంగా గ్రామస్తుల్లో మార్పు తీసుకురావడానికి మిత్రమండలి వాట్సాప్ గ్రూప్ సభ్యులు కృషిచేస్తున్నారు.