
ఆర్టీసీ బస్సు దహనం కేసులో ఇద్దరి రిమాండ్
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను గురువారం మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య విలేకరులకు వెల్లడించారు. తడకమళ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద గత నెల 23న అర్ధరాత్రి పార్కింగ్ చేసిన మిర్యాలగూడ డిపోకు చెందిన నైట్ హాల్ట్ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో.. బస్సు కండక్టర్ సీహెచ్. బాలకృష్ణ మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తడకమళ్ల గ్రామానికే చెందిన కుసుమ సుదర్శన్‌రెడ్డి, తంగెళ్ల జానకిరెడ్డి కలిసి డీజిల్‌ను బస్సు లోపల చల్లి నిప్పు పెట్టినట్లు పోలీసులు విచారణలో తేలడంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. సుదర్శన్‌రెడ్డిపై 8 కేసులు, తంగెళ్ల జానకిరెడ్డిపై ఐదు కేసులు ఉన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. సుదర్శన్‌రెడ్డి, జానకిరెడ్డిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిందితులపై రౌడీ షీట్ ఓపెన్