
పాడి పరిశ్రమతో విజయపథం
నడిగూడెం: రెండు గేదెలతో పాడి పరిశ్రమను ప్రారంభించి గత 18 ఏళ్లుగా నిత్యం ఉపాధి పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామానికి చెందిన పుట్టగుంట చందు. డిగ్రీ వరకు చదువుకున్న చందు 2007లో రెండు పాడి గేదెలతో పాడి పరిశ్రమ ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు 20 పాడి గేదెలు, 15 ఆవులతో పాడి పరిశ్రమ కొనసాగిస్తూ నిత్యం ఆదాయం పొందుతున్నాడు. రెండు పాడి గేదెల ద్వారా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ నేడు 20 గేదెల వరకు అభివృద్ది చేసుకున్నాడు. ఇంకా 10 వరకు దూడలు కూడా ఉన్నాయి.
రోజుకు 180 లీటర్ల పాల దిగుబడి
ఆయనకు ఉన్న 20 పాడి గేదెలు, 15 ఆవుల ద్వారా రోజుకు ఉదయం 80 నుంచి 90 లీటర్లు, సాయంత్రం 70 నుంచి 80 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నాడు. పాలను గ్రామానికి చెందిన పలువురికి నేరుగా వాడికల ద్వారా, కోదాడ, ఖమ్మం పట్టణాల్లో ప్రైవేట్ డెయిరీలకు విక్రయిస్తున్నాడు. లీటరు పాలకు రూ.60 నుంచి రూ.70 వరకు ఆదాయం వస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇద్దరు బిహారీ కూలీలకు ఉపాధి కల్పిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నాడు. పశువులకు ఎండు గడ్డితో పాటు పత్తి చెక్క, వేరుశనగ చెక్క, తవుడు, జొన్న పిండిని ఆహారంగా ఇస్తున్నట్లు చందు చెబుతున్నాడు. నాణ్యమైన పౌష్టికాహారం పెడుతుండడంతో పాల దిగుబడి అధికంగా వస్తుందని ఆయన పేర్కొన్నాడు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
గత 18 సంవత్సరాలుగా పాడిపరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నాను. ప్రజలకు, ప్రైవేట్ డెయిరీలకు డైరీలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నాను. మా లాంటి పాడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే పాల ఉత్పత్తులు పెంచేందుకు వీలుంటుంది. ప్రత్యేక రుణాలు, పశుగ్రాసం కోసం రాయితీ సౌకర్యం కల్పించాలి.
– పుట్టగుంట చందు, పాడి రైతు
18 ఏళ్లుగా పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న నడిగూడెం మండలం వాసి
నిత్యాదాయంతో పాటు ఉపాధి కల్పిస్తున్న పుట్టగుంట చందు

పాడి పరిశ్రమతో విజయపథం

పాడి పరిశ్రమతో విజయపథం