యూరియా అక్రమ రవాణా నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యూరియా అక్రమ రవాణా నిందితుల అరెస్ట్‌

Aug 1 2025 5:49 AM | Updated on Aug 1 2025 5:49 AM

యూరియా అక్రమ రవాణా నిందితుల అరెస్ట్‌

యూరియా అక్రమ రవాణా నిందితుల అరెస్ట్‌

చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్‌ కేంద్రంగా సబ్సిడీ యూరియా అక్రమ రవాణాకు పాల్పడిన ఆరుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి పేర్కొన్నారు. చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన వాసుదేవ్‌ శంకర్‌యాదవ్‌ వెలిమినేడు గ్రామ పరిధిలో గత కొంతకాలంగా దాబా నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా అదనపు ఆదాయం పొందేందుకు గాను గత ఆరు నెలలుగా వెలిమినేడు గ్రామానికే చెందిన టేకుల అంజిరెడ్డికి చెందిన స్థలంలో గోదాం ఏర్పాటు చేసి బీఎస్‌–6 వాహనాల్లో అదనపు మైలేజీ కోసం ఉపయోగించే డీఈఎఫ్‌(డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ప్లూయిడ్‌) తయారు చేస్తున్నాడు.

గోదాంలో డీఈఎఫ్‌ తయారీ..

ఈ గోదాంలో పరిశ్రమల శాఖ ద్వారా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా డీఈఎఫ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశాడు. యూరియా 33 శాతం, నీరు 66 శాతం ఉపగియోగించి డీఈఎఫ్‌ తయారు చేస్తున్నారు. ఇందులో సబ్సిడీయేతర యూరియాను వినియోగించడంతో అధిక లాభాలు రావడంలేదని, వ్యవసాయ పొలాల్లో వినియోగించే సబ్సిడీ యూరియాను కొందరి వద్ద కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి శంకరయ్య ద్వారా వెలిమినేడు పీఏసీఎస్‌ ద్వారా ఇటీవల కాలంలో రైతుల పేరున తీసుకున్న సబ్సిడీ యూరియాను కొనుగోలు చేసి డీఈఎఫ్‌ తయారుచేస్తూ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంటర్‌లో బీఎస్‌–6 వాహనాలకు విక్రయిస్తూ వస్తున్నాడు. వెలిమినేడు గ్రామంలో యూరియా కొరత ఏర్పడుతుండటంతో పోలీసులు గోదాంపై దాడి చేసి అక్రమంగా తయారవుతున్న డీఈఎఫ్‌ను పట్టుకున్నారు. 70 బస్తాల సబ్సిడీ యూరియా బస్తాలతో పాటు బోలేరో వాహనం, ఆటోను సీజ్‌ చేశారు. చిట్యాల మండల వ్యవసాయాధికారి గిరిబాబు ఫిర్యాదు మేరకు వాసుదేవ్‌ శంకర్‌యాదవ్‌తో పాటు అతడికి సహకరించిన గోలి శంకరయ్య, దుర్గయ్య, వినోద్‌కుమార్‌, రాజీవ్‌ రాయ్‌, రోషన్‌కుమార్‌ను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మధు, కానిస్టేబుళ్లు వెంకట్‌, ఖలీం, సాయి గణేష్‌, జాన్‌రెడ్డి, వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు.

వివరాలు వెల్లడించిన

నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement