
సాగర్‌లో పోలీసుల పటిష్ట బందోబస్తు
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం నుంచి గురువారం కూడా 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గురువారం సాక్షి దినపత్రికలో ట్రాఫిక్ జాం, సమ్మక్క సారక్క వద్ద పర్యాటకులు వాహనాలు నిలిపి జలాశయంలోకి దిగుతున్నారని ప్రచురించగా.. గురువారం కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్ జాం కాకుండా, దయ్యాల గండి వద్ద పర్యాటకులు వాహనాలు నిలిపి జలాశయంలోకి వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. సమ్మక్క సారక్క దగ్గర నుంచి కృష్ణానది తీరం వరకు రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్లను సైతం అధికారులు తొలగించారు. అంతేకాకుండా దయ్యాల గండి సమీపంలోని పర్యాటకులు పుష్కరఘాట్‌లోకి దిగకుండా చుట్టూ ట్రంచ్ కొట్టారు. ఎక్కడికక్కడ పర్యాటకుల వాహనాలను పోలీసులు వరుస క్రమంలో పెట్టిస్తుండటంతో గురువారం ఎక్కడా కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగలేదు.
యాదగిరిగుట్టపై ఆండాళ్ సదనం గదుల పరిశీలన
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చెందిన ఆండాళ్ సదనం గదులను ఆలయ ఈఓ వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. యాదగిరిగుట్ట పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆలయ అద్దె గదులు నిరుపయోగంగా ఉన్నాయని తెలుసుకుని స్వయంగా వెనాయన పరిశీలించారు. గదుల మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేసి భక్తుల కోసం వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏఈఓ రమేష్‌బాబు, సివిల్ ఈఈ దయాకర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ రామారావు తదితరులు ఉన్నారు.