
ద్విచక్ర వాహనంలో నుంచి నగదు చోరీ
కొండమల్లేపల్లి: ద్విచక్ర వాహనం డిక్కీలో నుంచి నగదును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన ముదిగొండ రాము తన ద్విచక్ర వాహనంపై కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో గల నాగార్జున గ్రామర్ హైస్కూల్‌లో ఉన్న తన మిత్రుడి కలిసేందుకు వచ్చాడు. పాఠశాల లోపలికి వెళ్లి ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి మిత్రుడితో మాట్లాడేందుకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తి ద్విచ్ర వాహనం డిక్కీలో దాచిన రూ.1.93లక్షల నగదును అపహరించాడు. ఈ దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో..
తిప్పర్తి: తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామంలో బుధవారం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చిన్నాయిగూడేనికి చెందిన బైరగోని సతీష్ బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలం నాటు వేయడానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. రూ.30వేల నగదు, తులంన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు.
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్..
వ్యక్తి మృతి
కొండమల్లేపల్లి: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం బాపూజీనగర్ వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన దమ్మోజు ఆంజనేయచారి (37) బుధవారం కొండమల్లేపల్లి పట్టణంలోని తమ బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొల్‌ముంతలపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిని ఆంజనేయచారిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి అక్క ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించాలి
● ఆర్టీసీ ఆర్‌ఎం కొణతం జానిరెడ్డి
మిర్యాలగూడ టౌన్: ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ఆర్టీసీ డిపోలో ఆయన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలోమీటర్ల రాబడి, ఆక్యుపెన్సీ రేట్‌ను పెంచాలన్నారు. ఆర్టీసీ ప్రతిష్టను కాపాడుకునే విధంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. టూరిజం ప్యాకేజీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చూడాలన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి, టీఐ–3 పుట్ట వైష్టవి తదితరులు ఉన్నారు.

ద్విచక్ర వాహనంలో నుంచి నగదు చోరీ