
నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతితో అధిక లాభాలు
త్రిపురారం: రైతులు పంటల సాగులో ఉత్తమ పద్ధతులు పాటించి నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతులు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయం విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు ఎం. యాకాద్రి అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంసాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో జిల్లాలోని రైతులకు వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ఎగుమతులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై దృష్టి సారించాలని, మెట్ట వరి సాగుతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణను వినియోగించుకోవాలన్నారు. అనంతరం త్రిపురారం, మర్రిగూడెం గ్రామాల్లో రైతులు సాగు చేసిన మెట్ట వరి సాగు అలాగే తిప్పర్తిలో సాగు చేసిన అధిక సాంద్రత పత్తి సాగును పరిశీలించి కేవీకే శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. మొట్ట పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్‌కుమార్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్, ఉద్యనవన శాస్త్రవేత్త హిమబిందు, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ
వ్యవసాయ విశ్వవిద్యాలయం
విస్తరణ సంచాలకుడు యాకాద్రి
కేవీకే కంపాసాగర్‌లో రైతులకు
పంటల ఎగుమతులపై శిక్షణ